Cruise Terminal Ready in Visakhapatnam: విశాఖలో అంతర్జాతీయ టూరిస్టుల కోసం…
విశాఖపట్నంలో క్రూయిజ్ టెర్మినల్ కు (Visakhapatnam Cruise Terminal) సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ. 96.05 కోట్లతో నిర్మించిన ఈ క్రూయిజ్ టెర్మినల్ లో క్రూయిజ్ నౌకలతో పాటు భారీ కార్లో నౌకల (Cargo Ships) హ్యాండ్లింగ్ కు కూడా అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినలుకు వచ్చే వారం ట్రయిల్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ టెర్మినల్ నిర్వహణను ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు (Visakhapatnam Port) చూస్తుంది. భారత్ లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది.
క్రూయిజ నౌకలో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేద తీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్ లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మించారు.
టెర్మినల్ లో 330 మీటర్ల భారీ పొడవైన భారీ క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్ నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్ లోకి అనుమతించేలా డిజైన్ చేశారు.