ములుగు జిల్లా (Mulugu Dist) ని డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ లో డెంగీ జ్వరాల (Dengue Fevers) తో ఈ జిల్లాలో నలుగురు మరణించారని (Four dead) ఆ జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు.
చనిపోయిన ఈ నలుగురుకి డెంగీ జ్వరాలతో పాటు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పెరిగాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా డెంగీతో పాటు విష జ్వరాలు ప్రబలుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన గంట్ల నరేష్ డెంగీ జ్వరానికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన ఏడేళ్ల సోన్ కాంబ్లే శృతి కూడా డెంగీతోనే మృతి చెందింది. ఇక, ములుగు జిల్లా వాజేడు మండలం మొట్లగుడెంకు చెందిన కుర్సం రజిని కూడా డెంగీతోనే వారంత రోజులుగా పోరాడి మృతి చెందింది.
ఇలా రాష్ట్రంలోని పలు చోట్ల డెంగీ జ్వరాలు ఎక్కువగా ఉండటం, పలువురు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. దీంతో డెంగీ జ్వరాలపై దృష్టి పెట్టిన వైద్యాధికారులు అయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు డెంగీ జ్వరాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు.
ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు డెంగీ జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో వీరి కోసం ఆసుపత్రి ఓపీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. డెంగీ జ్వరాల తీవ్రత పెరుగుతుండటంతో మంత్రి హరీష్ రావు వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.