సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలను ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin)సమర్థించినట్లుగా మాట్లాడటంపై ఆ రాష్ట్ర బీజేపీ(BJP) అధ్యక్షుడు అన్నామలై(Annamalai) ధీటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంకేకు కొత్త అర్థం చెప్పారు.
DMK అంటే డెంగ్యూ, మలేరియా, కోసు (దోమ) అని, దీనిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే డ్రామాలు అందరికీ తెలుసునన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారని, రెండో ఏడాది నిర్మూలించాలని చెప్పారని, మూడో సంవత్సరంలో నిర్మూలిస్తామని చెబుతారని, కానీ నాలుగో ఏడాదికి వచ్చేసరికి మేం హిందువులం, మా పార్టీలో 90 శాతం హిందువులు అని చెబుతారని, ఐదో ఏడాది మీరు కూడా హిందువులే అని చెబుతారని విమర్శలు గుప్పించారు.
తమిళనాడు దశాబ్దాలుగా ఈ నాటకాన్ని చూస్తోందన్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు రాగానే ఆయన అమర్, అక్బర్, ఆంటోనీ అయిపోతారన్నారు. ఆయన 17 ఏళ్ళుగా విఫలనాయకుడిగా మిగిలిపోయాడన్నారు. ఒక రాష్ట్రంలో అమర్ గా, మరో రాష్ట్రంలో అక్బర్ గా, ఇంకో రాష్ట్రంలో ఆంటోనిగా మారుతారని ఎద్దేవా చేశారు.
2024లో డీఎంకే తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని, ఈ మాట తాను అనడం లేదని, మీ కొడుకు ఉదయనిధి చెప్పారన్నారు. ఎందుకంటే డీఎంకే అంటే డీ అంటే డెంగ్యూ, ఎం అంటే మలేరియా, కే అంటే కోసు (దోమ) అన్నారు.