డబ్బులున్నవాళ్లని తన కుమార్తె (Musk Daughter) చెడ్డవాళ్లుగా భావిస్తుందని, దానికి కారణం ఆమె చదివిన పాఠశాలే అయి ఉండొచ్చునని ప్రపంచ కుబేరుడు (Rich person) ఎలాన్ మస్క్ (Elon Musk) పుస్తక రూపంలో వస్తున్న తన బయోగ్రఫీలో చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న విడుదల అవుతుందని సమాచారం.
టెస్లా సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్రను ప్రముఖ రచయిత వాల్టర్ ఐజాక్సన్ (Walter Isaacson) రచించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. తన బయోగ్రఫీలో మస్క్ పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. మస్క్ తన కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ (Vivian Jenna Wilson)తో ఉన్న విభేదాల గురించి ఆ పుస్తకంలో చెప్పినట్లు సమాచారం.
“జెన్నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువ. డబ్బులున్న వాళ్లందరూ చెడ్డవాళ్లని ఆమె భావిస్తుంది. ఆమె అలా మారడానికి తను చదువుకున్న స్కూలే కారణం. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించా, కానీ ఆమె నాతో కాస్త సమయం కూడా గడపడానికి ఇష్టపడలేదు. నా మొదటి కుమార్తె మరణం కంటే జెన్నాతో విభేదాలే నన్ను ఎక్కువ బాధించాయి” అని మస్క్ పుస్తకంలో పంచుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఎలాన్ మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో 2008లో విడాకులు తీసుకున్నారు. మస్క్, జస్టిన్ దంపతులకు జేవియర్ అలెగ్జాండర్ గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్ అలెగ్జాండర్ అమ్మాయిగా మారి తన పేరును వివియన్ జెన్నా విల్సన్ గా మార్చుకుంది.
తన తండ్రి ఎలాన్ మస్క్ తో ఏ విధమైన సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జెన్నా గతంలో వెల్లడించింది.