బాలాఘాట్ జిల్లాలో మధ్యప్రదేశ్ పోలీసులకి, మావోయిస్టులకు (Naxalites) మధ్య జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో ఒక మావోయిస్టు మరణించినట్లు చత్తీస్ ఘడ్ (Chhattisgarh) పోలీసులు ప్రకటించారు. రూప్జార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌంగూడ అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. చనిపోయిన మావోయిస్టు పేరు కమ్లు అని పేర్కొన్నారు. ఇతనిపై రూ. 14 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
కమ్లు నిషేధిత సంస్థ ‘నక్సలీ దళం తండా దదేకస’ యూనిట్లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. తాము సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తమపై కాల్పులు జరిపారని, తాము ఎదురు కాల్పులు జరిపామని చెప్పారు. ఆ కాల్పుల్లోనే కమ్లు మరణించాడని తెలిపారు.
ఈ ఘటనను బాలాఘాట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమీర్ సౌరభ్ ధృవీకరించారు. కాల్పుల్లో మరణించిన కమ్లు బీజాపూర్ నివాసని, అతడు 2015 నుంచి నిషేధిత సంస్థలో పని చేస్తున్నాడని వివరించారు. కమ్లుపై 24 క్రిమినల్ కేసులున్నాయన్నారు.
ఘటన స్థలంలో ఒక రైఫిల్ లభించిందని, ఎన్కౌంటర్లో మరికొంత మంది నిషేధిత సంస్థ సభ్యులు గాయపడ్డారని, వారి ఆచూకీ కోసం సెర్చ్ చేస్తున్నట్లు బాలాఘాట్ సూపరింటెండెంట్ సౌరభ్ తెలిపారు.