మొరాకో(morocco)లో భారీ భూకంపం(earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు(richter scale)పై భూకంప తీవ్రత 6.8 గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 296 మంది మరణించారు. సుమారు 160 మంది వరకు గాయపడ్డారు. వారందరనీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భూకంపం వల్ల మరాకెచ్ నగరంలోని భవనాలు నేలమట్టమయ్యాయి.
నగరంలో శుక్రవారం రాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. పర్యాటకులు, స్థానికులు భూకంపానికి సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాత్రి 11.11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
దక్షిణ మరాకెచ్ కు 70 కిలో మీటర్ల దూరంలో దక్షిణ అట్లాస్ పర్వతాల్లో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు పేర్కొంది. భూమి లోపల 18 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్టు చెప్పింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భూకంపంలో మృతుల వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు మోడీ ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా వుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.