
రాజకీయంగా తాను చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నానని.. గత 24 ఏళ్లు ప్రజా ఉద్యమంలో మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నానని సోమన్న అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందిని, ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నానని సోమన్న ఆ వీడియోలో తెలిపారు.
గత రెండేళ్లలో వైఎస్ఆర్టీపీలో ప్రాధాన్యత ఇచ్చి నాయకుడిగా గుర్తించిన షర్మిలమ్మకు వందనాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ప్రకటించి మంచి అవకాశం కల్పించారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, తొమ్మిదేళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు కేసీఆరే సరైన నాయకుడు అని విశ్వసిస్తున్నారని చెప్పారు. ఇకనుండి తన ఆట, పాట, మాట అన్నీ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఒక ఆడబిడ్డగా షర్మిలమ్మను గౌరవిస్తాను, ఆమె డైనమిక్ లీడర్ అంటూ షర్మిలమ్మను ఆ వీడియోలో పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇకపై తన ప్రయాణం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుందని ఆ వీడియోలో పేర్కొన్నారు.