పథకాలన్నీ కేసీఆర్ (KCR) బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు తప్ప, అర్హులకు ఇవ్వడం లేదని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ (Etela Rajendhar) అన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టాక మహిళా సంఘాల్లో కళ లేదని, నాలుగున్నరేళ్లుగా వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన రూ.4500 కోట్లు బకాయి పెట్టారని రాజేందర్ చెప్పారు. ఈసారి బీజేపీ (BJP) కి అవకాశం ఇవ్వండి, మేము మొత్తం డబ్బులు ఇవ్వడమే కాదు, రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.18 వేల రూపాయలు అందిస్తుంటే…కేసీఆర్ రైతుబంధు ఇచ్చేది రూ.10 వేలే అని చెప్పారు. రైతుబంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలను కేసీఆర్ ఎత్తివేశారని, పైగా వందల ఎకరాలు ఉన్న వారికి మాత్రం రైతుబంధు పేరిట డబ్బులు ఇస్తున్నారని, బీజేపీ అధికారంలో వచ్చాక ఇటువంటి వారికి రైతుబంధు ఇవ్వమని చెప్పారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో తప్పుడు కేసులు పెడుతున్నారని, వాటిని ప్రశ్నించిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని, పైగా ఈ నియోజకవర్గంలో మర్డర్లు ఎక్కువగా జరుగుతున్నాయని కార్యకర్తలు చెప్పారని ఈటెల అన్నారు. ఇది ఒక తుంగతుర్తికే పరిమితం కాదని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని, దీనికి బీజేపీ పరిష్కారం చెప్తుందన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే ఈ దుర్మార్గాలకు చెక్ పెడతామని తెలిపారు.
తుంగతుర్తిలోని యువకుల ఉత్సాహం, ఆక్రోశం చూస్తుంటే కేసీఆర్ పార్టీని బొంద పెడతారనే విశ్వాసం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డమీద ఎగిరేది కాషాయ జెండానే అనే గట్టి నమ్మకం ఉందన్నారు.