జీ20 సమావేశాలను భారత్ (Bharat) విజయవంతంగా నిర్వహించిందని అమెరికా ప్రశంసించింది. సోమవారం అమెరికా (America) లో విలేకరులు జీ20 సదస్సు గురించి ప్రశ్నించగా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ (US State Dept) అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాధానమిస్తూ…జీ20 సంపూర్ణంగా విజయవంతమైందని తాము కచ్చితంగా నమ్ముతున్నామని తెలిపారు.
ఈ సదస్సుకు రష్యా హాజరుకాకపోవడంపై ప్రశ్నించగా.. ఇందులో విభిన్నమైన అభిప్రాయాలు కలిగిన సభ్యులు ఉన్నారని…ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునిచ్చే డిక్లరేషన్ను ఈ సదస్సు విడుదల చేయగలిగిందని చెప్పారు.
జీ 20 సభ్యదేశాలు బాలి డిక్లరేషన్ను గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. యూఎన్ చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని అన్నారు. ప్రాంతాలను స్వాధీనం చేసుకునే బెదిరింపులు, బలప్రయోగాలకు దూరంగా ఉండాలని సభ్య దేశాలు గుర్తు చేసినట్లు తెలిపారు. అణ్వాయుధాల బెదిరింపులు, ఉపయోగం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢీల్లీలో ఈ సదస్సు ఘనంగా జరిగింది.