కాంగ్రెస్ (Congress) ఎంపీ గౌరవ్ గొగొయి(Gaurav Gogoi) మీద అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ పరువునష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనీ, సీఎం భార్య సబ్సిడీ తీసుకున్నారనీ ఎంపీ గౌరవ్ గొగొయి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ గౌరవ్ గొగొయి తనమీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు తనకు రూ.10 కోట్లు పరువునష్టంగా చెల్లించాలని రినికి దావాలో పేర్కొన్నారు. కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆఫ్ కామరూప్ మెట్రోపాలిటన్ లో ఈ దావాను వేసినట్లు వివరించారు రినికి తరపు న్యాయవాది దేవజిత్ సైకియా తెలిపారు.
పీఎం కిసాన్ సంపద యోజన పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు కేంద్ర ఆహార శాఖ వెబ్సైట్ పేర్కొన్నది. తాజా వ్యవహారం అస్సాంలో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
దీనిపై దావా వేసిన రినికి … కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సబ్సిడీ అందలేదని తెలిపారు. అసలు సబ్సిడీ ఇచ్చేందుకు చేపట్టాల్సిన ప్రక్రియే జరగలేదని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానమేనని తప్పుడు ఆరోపణలు చేస్తే… వాటిని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామన్నారు.
నాగోన్ జిల్లా డారిగాజి గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక భూమిగా అధికారులు వర్గీకరించారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే సీఎం హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు ఆ భూమిని కొనుగోలు చేయటం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలంటూ గౌహతి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈ ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తోసిపుచ్చారు. పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా తన భార్య గానీ, ఆమెకు చెందిన కంపెనీ గానీ ఎలాంటి సబ్సిడీ తీసుకోలేదని తెలిపారు.