ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు టెక్ దిగ్గజ సంస్థలను వదలట్లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు(Layoff) ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెజాన్, గూగుల్(Google), ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే.
ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.
గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్.. రిక్రూట్మెంట్ విభాగంలో వందలాది మందికి లేఆఫ్స్ ప్రకటించింది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈసారి వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు సంస్థ పేర్కొంది. వీరిలో చాలా మంది గ్లోబల్ రిక్రూట్మెంట్ టీమ్ నుంచి ఉన్నట్లు వెల్లడించింది.
కొత్తగా నియామకాలను కూడా తగ్గించినట్లు అల్ఫాబెట్ చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ ద్వారా లేఆఫ్స్ సమాచారాన్ని బుధవారం అందించినట్లు పేర్కొంది.
ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులకు లేఆఫ్స్ విధించిన అతిపెద్ద టెక్ కంపెనీ అల్ఫాబెట్ కావడం గమనార్హం. మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు 2023 ప్రారంభంలో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించాయి. అల్ఫాబెట్ కూడా ఇప్పటికే ఈ సంవత్సరం జనవరిలో తమ వర్క్ ఫోర్స్లో 6 శాతం (12 వేల మంది) ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది.