హైదరాబాద్ ఫిలిం నగర్ (Film Nagar) పీఎస్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాల (Gurukula Patasala) హాస్టల్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో విద్యార్థులు వినాయకుడిని ఏర్పాటు చేయగా.. దేవుడి వద్ద పెట్టిన దీపం ప్రమాదవశాత్తు దుప్పట్లకు అంటుకోవటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌పేట అలిజాపూర్‌లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియకుండా కొందరు విద్యార్థులు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు మూడోరోజు విగ్రహాలను నిమజ్జనం చేయించారు. అయితే థర్డ్ ఫ్లోర్ లోని కొందరు విద్యార్థులు తాము తెచ్చిన విగ్రహాన్ని రహస్యంగా దాచి ఉంచారు.
రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. బయటకు వెళ్తున్న క్రమంలో మంటల్లో చిక్కుకున్న శేరిలింగంపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న నీరజ్, రజనీకాంత్ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు గాయపడ్డ ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సకాలంలో విద్యార్థులు అందరూ బయటకు పరుగులు తీయటంతో పెను ప్రమాదం తప్పింది.