కొచ్చి నుండి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం ఉదయం 10.30 గంటలకు 6ఇ6482 ఇండిగో విమానం బెంగళూరు వెళ్లాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులను కిందకు దింపారు. తనిఖీ చేసేందుకు విమానాన్ని ఖాళీ ప్రాంతానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
బాంబు బెదిరింపులు వచ్చినట్లు నెడుంబస్సేరి పోలీసులు కూడా ధృవీకరించారు. ఈఘటనపై దర్యాప్తు కోసం ఓ బృందాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు.
కాగా ఈనెల 18న ఢిల్లీ-పుణే విస్తారా ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉందని ఫోన్ కాల్ రావడంతో విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆపై బాంబు బెదిరింపు కాల్ బూటకమని భద్రతా వర్గాలు, పోలీసులు తేల్చిచెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.