అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Inner Ring Road) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ఏ14గా నారా లోకేష్ (Nara Lokesh) సీఐడీ చేర్చింది. దీనికి సంబంధించిన మెమోను ఇవాళ ఏసీబీ కోర్టు (ACB Court) లో దాఖలు చేసింది. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీమంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్పులు చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఏపీలో ఇప్పుడు కేసులు, అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ కాగా, ఇప్పుడు నారా లోకేష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ.. ఇప్పుడు నారా లోకేష్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే… అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైస్సార్సీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ఏడాది ఐపీసీ, అవినీతి నిరోధకచట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
దీంతో టీడీపీ వరుస కేసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇప్పుడు తదుపరి అరెస్ట్ నారా లోకేష్ దేనా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇప్పటికే చంద్రబాబును 2 రెండు రోజుల కస్టడీకి తీసుకుని సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. అయితే, సరైన సమాచారం రాలేదని, ఇంకా విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.