ఎఫ్414 ఫైటర్ జెట్ (Jet) ఇంజిన్ల తయారీ ఇకపై భారత్లోనే జరగనుంది. ఇందుకు అమెరికా కాంగ్రెస్ (America congress) ఆమోదం తెలిపింది. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan aeronatics limited) తో కలిసి తయారుచేయనున్న ఈ ఇంజిన్లను భారత వాయుసేన కోసం వినియోగించనున్నారు. ఇవి అమెరికాకు చెందిన అత్యున్నత శ్రేణి జెట్ ఇంజిన్లు కావడం గమనార్హం.
ఈ ఒప్పందం కింద దాదాపు 80 శాతం టెక్నాలజీని జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ భారత్కు బదలాయిస్తుంది. దీంతో భారత వాయుసేన ఉపయోగించే తేజస్ ఎంకే2కు అవసరమైన ఇంజిన్ల తయారీ సులువవుతుంది. ఈ భాగస్వామ్యం ఓ పెనుమార్పునకు నాంది పలుకుతుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సీబీ అనంత కృష్ణన్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో దేశీయంగానే తయారు చేసిన విమాన ఇంజిన్లను మన జెట్లకు అందించేందుకు ఇది పునాది వేస్తుందని వివరించారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం 99 ఇంజిన్లను జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కారణంగా వీటిని అతి తక్కువ ధరలోనే నిర్మించడం సాధ్యమవుతుంది. ఎఫ్ 414 ఇంజిన్ను ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు అత్యుత్తమ ఫైటర్ జెట్లు వినియోగించాయి.
చైనా టెక్నాలజీలో ఎంత ముందున్నా.. ఇప్పటి వరకు సొంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదు. జే-20 ఫైటర్ జెట్ల కోసం ఆ దేశం సొంతంగా షెన్యాంగ్ డబ్ల్యూ-10 ఇంజిన్లను అభివృద్ధి చేసినా.. అవి పశ్చిమదేశాల ఇంజిన్లతో పోటీ పడే స్థాయిలో లేవు. దీంతో డబ్ల్యూ-15 రకంపై చైనా దృష్టిపెట్టింది. వీటి పనితీరు అద్భుతంగా ఉందని ఆ దేశం చెబుతున్నా.. ఎక్కడా నిరూపించుకోలేదు.