Kadapa TDP: కడప టిక్కెట్ట్ కోసం అమీర్ బాబుకి ఇస్తే…ఆ రెండు కుటుంబాలు ఏం చేస్తారు?
కడప అసెంబ్లీ టిక్కెట్లు (Kadapa Assembly ticket) కోసం టీడీపీ (TDP) లోని రెండు బలమైన కుటుంబాలు పోటీ పడుతున్నాయి. అందులోనూ ఆ కుటుంబాల్లోని మహిళలకే ఆ సీట్లు ఇవ్వాలని పంతానికి పోతున్నారు. దీంతో పంచాయితీ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వద్దకు చేరింది.
కడప అసెంబ్లీ సీటు దక్కించుకోవడం టీడీపీలోని శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరెడ్డిలకు ప్రతిష్మాత్మకంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గా ఉన్న ఆర్ శ్రీనివాస్ రెడ్డి తన సతీమణి మాధవికి టికెట్ ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఉమాదేవికి ఇప్పించుకోవాలన్న జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి తన కోడలు ఉమాదేవికి టిక్కెట్టు ఎలా తీసుకురావాలని పంతంతో ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి.
కడప అసెంబ్లీ టికెట్ విషయంలో వీరి మధ్య విభేదాలు పెరిగాయి. కడప టికెట్ బరిలో ఈ ఇద్దరితో పాటు అమీర్ బాబు ఉన్నారు. వీరే కాకుండా ఆ పార్టీ సీనియర్ నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డిలు కూడా టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ప్రధాన పోటీ శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవి, లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి మధ్యనే ఉంది. ఈ పరిస్థితిలో శుక్రవారం లక్ష్మి రెడ్డి, ఆయన తనయుడు మన్మోహన్ రెడ్డిలతో పాటు దేశం ఇన్చార్జి అమీర్ బాబును చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడారు.
చంద్రబాబును కలిసినప్పుడు లక్ష్మి రెడ్డి స్థానికేతర వాదన తీసుకొచ్చి…తమను కాదని టికెట్ వేరే వాళ్లకి ఇస్తే సహకరించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగని ఉమాదేవికి టికెట్ ఇస్తే శ్రీనివాస్ రెడ్డి సహకరిస్తారా అనే ప్రశ్న కూడా టీడీపీ నాయకుల్లో ఉంది. మరో వైపు అమీర్ బాబుకే టిక్కెట్ ఇస్తే మరి ఈ ఇద్దరు నేతలు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
మరో వైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులు కుదిరితే కడప సీటును పొత్తులో భాగంగా ఏదో ఒక పార్టీ కేటాయించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కడప టీడీపీ అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపు రాజకీయం టీడీపీలో గట్టి ప్రకంపనలే సృష్టించే అవకాశం ఉంది.