జేడీఎస్ నేత కుమారస్వామి (Kumara Swamy) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ “నా శవం కూడా బీజేపీ వైపు వెళ్లదు” అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిద్దరామయ్య గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని జేడీఎస్ (JDS) నేత కుమారస్వామి(JDS leader Kumaraswamy) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
“నా రాజకీయ జీవనమే సెక్యులరిజం భావాలను కలిగి ఉంది. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే వచ్చాను. ఇటీవల ఢిల్లీలో నేను అమిత్‌షాను కలిశాను. అంతమాత్రాన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లేనా? ” అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ చేస్తున్న ఆలోచన ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదన్నారు. కర్ణాటకలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయని, మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని, రెండూ ఒకేసారి అంటే ఎలాగన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
మరో వైపు కర్నాటకలో కాంగ్రెస్ దుష్ట పాలనను అంతం చేసేందుకు ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. హుబ్బళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. సిద్ధరామయ్య దిక్కూ దిశా లేకుండా కేవలం వేధింపులు, కక్షసాధింపు రాజకీయాలే చేస్తున్నారు.” అని ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ, జేడీఎస్ ఇకపై ఉమ్మడిగా
పోరాటం చేస్తాయని తెలిపారు.