తెలంగాణలో (Telangana) త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) వరాల జల్లు కురిపించింది. ఢిల్లీలో (Delhi) ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ వివిధ అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్ ఉజ్వల పథకం కింద ఇస్తున్న ఎల్ పీజీ సబ్సీడీని రూ.200 నుంచి రూ.300 వరకూ పెంచిందని చెప్పారు.
తెలంగాణకు పసుపు బోర్డు కేటాయిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు.ఈ పసుపు బోర్డు వల్ల కేవలం తెలంగాణ రైతులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలోని పసుపు రైతులకు కూడా లాభం కలుగుతుందని పేర్కొన్నారు.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రెండు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లో ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు. తొలి దశలో రూ.1,889 కోట్ల నిధులను కూడా కేటాయిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 2015లోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు కావల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సకాలంలో భూసేకరణ పూర్తి చేయకపోవడం వల్లే ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా జరిగే ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రస్తుతం కేంద్రం రూ.200ల చొప్పున రాయితీ ఇస్తుండగా.. తాజాగా దాన్ని రూ.300లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్ మార్కెట్ ధర రూ.903కు బదులుగా ప్రస్తుతం రూ.703 చెల్లిస్తుండగా.. తాజా నిర్ణయంతో ఇకపై సిలిండర్‌కు రూ.603 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు.
ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ కు కృష్ణానీటి కేటాయింపు పై చర్చించిన క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఏపీ-తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని పేర్కొన్న క్యాబినెట్ కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు.