ఉదయనిధి(Udayanidhi Stalin)వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్రప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిందూ సంఘాలు, జాతీయ పార్టీల నేతలు ఉదయనిధి స్టాలిన్‌పై మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించిన ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఢిల్లీ నుంచి తమిళనాడుకు తరలివెళ్లారు బీజేపీ(BJP) నేతలు. హౌస్ రెసిడెంట్ కమిషనర్‌కు ఉదయనిధి వ్యాఖ్యలపై వినతిపత్రం అందించారు.
తమిళనాడు గవర్నర్‌కు కూడా ఉదయనిధి స్టాలిన్‌పై ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉదయనిధి వ్యాఖ్యానించారని, సనాతధర్మ సంస్కృతి సంప్రదాయాలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన కామెంట్స్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు.
భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం హేయమైన చర్య అన్నారు. అదే వేదికపై, తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్ బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతమని పురంధేశ్వరి నిలదీశారు.
తమిళనాడు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం హేయమైన చర్య అన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఉదయనిధి హిందువులను అవమాన పరిచారన్నారు. గజినీ నుంచి ఔరంగ జేబు, షాజహాన్, నిజాం, రజాకార్లు, గుడులు, గోపురాలపై దాడులు చేసినా.. సనాతన ధర్మం పెరుగుతూనే ఉందన్నారు. తమిళనాడు, భారత చరిత్ర వేర్వేరు కాదన్నారు లక్ష్మణ్.
ఇక ఉదయనిధి వ్యాఖ్యలపై చిలూకూరు పూజారి రంగరాజన్ మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. డీఎంకే పార్టీకి మరోసారి అధికారం కట్టబెట్టవద్దని తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. కాల పరీక్షను తట్టుకొని సనాతన ధర్మం నిబడిందన్నారు రంగరాజన్. సనాతన ధర్మం గురించి తెలుసుకొని మాట్లాడాలని పురోహితులు హితువు పలికారు.