ఆఫ్రికా (Africa)దేశం లిబియా (Libiya)లో డెనియల్ (Deniyal) తుఫాన్ జల ప్రళయం సృష్టించింది. వర్షాల కారణంగా నగరంలో రెండు డ్యామ్(Dam) లు బద్దలవ్వడంతో కింద ప్రాంతాలకు వరద పోటెత్తింది. దీంతో దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా సముద్రంలోనికి కొట్టుకుపోయారు. భవనాలు, ఇళ్లలో ఉన్న వారు కూడా ఆ వరద తాకిడికి కొట్టుకుపోయారు.
ఈ ఉత్పాతం వల్ల 5,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబు లమౌషా తెలిపారు. మరో 10 వేల మంది ఆచూకీ గల్లంతైనట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అనేక నగరాలు వరద ప్రభావానికి గురయ్యాయని, డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం జరిగినట్లు తెలిపారు.
డెర్నాలో పరిస్థితి ఘోరంగా ఉందని.. రహదారులపైనే అనేక మృతదేహాలు పడి ఉన్నాయని లిబియా ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్ జలీల్ వెల్లడించారు. రెండు డ్యామ్‌లు కొట్టుకుపోవడం వల్ల వరద తీవ్రత పెరిగిందని లిబియా ప్రధాని ఒసామా హమద్ తెలిపారు. అందుకే తీవ్ర ప్రాణ నష్టం జరిగిందని అన్నారు.విపత్తు సంభవించిన 36 గంటల తర్వాత కూడా భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.
ఈ వినాశనానికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వీటిల్లో పర్వతాల నుంచి సిటీ సెంటర్ గుండా ప్రవహించే నది వెంట మొత్తం నివాస ప్రాంతాలు తొలగిపోయి కనిపించగా.. పలు బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనాలు బురదలో కూలిపోయినట్లు ఉన్నాయి.
డెర్నా ఇప్పుడు డిజాస్టర్ జోన్‌గా మారిందని ఆయన అన్నారు. ప్రధాని మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించి, దేశవ్యాప్తంగా జెండాలను సగానికి అవనతం చేయాలని ఆదేశించారు.