కాంగ్రెస్ నాయకులకు మామ అల్లుళ్ల సినిమా ఎలా ఉంటుందో చూపిస్తామని మంత్రి మల్లా రెడ్డి (Malla Reddy) అన్నారు. కార్యకర్తలంతా కష్టపడి కాంగ్రెస్ (Congress) కు డిపాజిట్లు రాకుండా చేయాలి. కాంగ్రెస్ మోసపూరిత మాటలు పట్టించుకోకండి, కేసీఆర్ (KCR) నవంబర్ 16న వరాలు కురిపిస్తారని మల్లారెడ్డి చెప్పారు.
మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇవాళ నిర్వహించిన బైక్ ర్యాలీలో మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ దాదాపు 15 వేల మందితో భారీ ర్యాలీ చేశారు. దీంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి ని బీఆర్ఎస్ పోటీలోకి దింపడం దాదాపు ఖాయమైనట్టేనన్న టాక్ వినిపిస్తోంది.
మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు పేరును ఖరారు చేయగా.. తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వకపోవటంతో ఆయన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. దీంతో అక్కడ మరో అభ్యర్థిని నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేసింది. చివరకు మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఆ స్థానం నుంచి పోటీచేయించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మర్రి రాజశేఖర్‌రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే ఈ నియోవజర్గంలో ఆయనకు ఉన్న పరిచయాలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో గులాబీ బాస్ మర్రి వైపు మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం.. అంతర్గతంగా వారికి సమాచారమిచ్చినట్లు టాక్ నడుస్తోంది.