జీ-20 సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించక పోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం ఫైర్ అయ్యారు. ఈ మేరకు కేంద్రంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు ఉనికిని కోల్పోయే దశకు భారత్ చేరుకోలేదని తాను ఆశిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. మరే ఇతర ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకున్ని ప్రపంచ నేతల రాష్ట్ర విందుకు ఆహ్వానించకుండా ఉండదని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
కేవలం ప్రజాస్వామ్యం లేని దేశాలు, ప్రతిపక్షాలు లేని దేశాల్లోనే ఇలాంటివి జిరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశ జనాభాలో 60 శాతం మందికి నేతగా వున్న ప్రతిపక్ష నేతను కేంద్రం గుర్తించడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
జీ-20 సమావేశాల సందర్భంగా ప్రపంచ నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు 170 మంది నేతలకు ఆహ్వానం పంపారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవేగౌడలను ఈ విందుకు ఆహ్వానించారు. కానీ ఈ విందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం.