సనాతన ధర్మం (Sanathana Dharma) పై ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యల తర్వాత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మంపై ఎవరు, ఏం మాట్లాడినా ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasada Rao) కూడా సనాతన ధర్మంపై మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ధర్మ ప్రచార వారోత్సవాలలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై ఆయన మాట్లాడారు.
సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి పై ఉందని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ధర్మపరిరక్షణకు పాటుపడాలని తద్వారా సమసమాజ స్థాపన సాధ్యపడుతుందని అన్నారు. హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పెద్ద ఎత్తున ధర్మ ప్రచార వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం ధర్మ ప్రచారానికి కట్టుబడి ఉందని మంత్రి ధర్మాన అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక ధర్మ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించామనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
అంతకు ముందు అరసవల్లి ఆలయంలో నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించిన కోలాట బృందాలు ఆలపించిన గీతాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు విన్నారు. ఈ గీతాలను భక్తులను కూడా ఎంతో ఆకట్టుకున్నాయి.