రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) లో చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణీ, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయని, ముఖ్యంగా భవిష్యత్తు రాజకీయలు (Politics), వాటి పరిణామాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై తనతో చర్చించారని యనమల తెలిపారు.
పార్టీ తరపున సమన్వయ కమిటీ సభ్యుల నియామకం అంశం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లాలని, లోకేశ్ ఢిల్లీ నుంచి రాగానే చర్చించి త్వరగానే సభ్యులను నియమిద్దామని చంద్రబాబు చెప్పారని యనమల తెలిపారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన శ్రేణులు దేశ విదేశాల్లో కలిసి కార్యక్రమాలు చేస్తున్న తీరును చంద్రబాబుకు వివరించానని తెలిపారు. తనని జైల్లో పెట్టి జగన్ పొందుతోంది తాత్కాలిక ఆనందమేనని ఇక వైసీపీ పనైపోయిందని చంద్రబాబు అన్నారని చెప్పారు. జైల్లో ఏసీ లేకపోవడం, దోమలు వంటి సమస్యలున్నాయని, అయినా వాటిని తాను తట్టుకోగలనని, కానీ క్యాడర్ ను ప్రభుత్వం కక్షతో వేధించటమే బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన చెందినట్లు తెలిపారు.
ఈ కష్టకాలంలో తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అండగా నిలవాలని తనకు సూచించారని, ప్రభుత్వ అరాచకాలపై పోరాటం ఆపొద్దని చెప్పారని యనమల తెలిపారు. పార్టీలో నాయకులు, క్యాడర్లు మనోధైర్యం కోల్పోకుండా సీనియర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారని చెప్పారు. అలాగే తన అరెస్ట్‌ను ఖండిస్తూ సంఘీభావం తెలిపిన జాతీయ నాయకులందరికీ కృతజ్ఞతలు చెప్పిన సందేశాలు పంపాలని చంద్రబాబు సూచించారన్నారు.
అలాగే ఇవాళ ములాఖత్‌తో భువనేశ్వరి, బ్రాహ్మణిలతో దాదాపు 20 నిమిషాలు విడిగా చంద్రబాబు సమావేశమయ్యారు.