ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ (Nara Lokesh)మీద సీఐడీ (CID)నమోదు చేసిన కేసులో రేపు జరగాల్సిన విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నారా లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రేపు జరగాల్సిన విచారణ కాస్తా ఈ నెల 10 తేదీకి వాయిదా వేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసు మీద రేపు విచారణకు రావాలని తెలుపుతూ నారా లోకేష్ కు 41ఏ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు వచ్చేటప్పుడు తాను డైరెక్టర్ గా ఉన్న హెరిటేజ్ అమరావతిలో కొన్న ఆస్తుల వివరాలు, బోర్డు తీర్మానాలు కూడా తీసుకురమ్మని నోటీసుల్లో పేర్కొన్నారు.
సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో హెరిటేజ్ వివరాలు తీసుకురమ్మని కోరడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో లోకేష్ విచారణను రేపటి నుంచి అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సీఐడీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 10వ తేదీన జరిగే విచారణకూ షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. లాయర్ సమక్షంలోనే విచారణ చేయాలనీ, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలనీ ఆదేశించారు.