ఏపీ మంత్రి, సినీ నటి రోజా (rk roja selvamani)భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి(rk selvamani) పై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ (non bailable warrant) జారీ చేసింది. చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. చెన్నై కోర్టులో 2016 నుంచి ఈ కేసు వెంటాడుతోంది. సెల్వమణి వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు సీరియస్‌గా స్పందించింది.
2016లో ఓ కేసు విషయంలో ముకుంద్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ అరెస్ట్ అయ్యారు. ముకుంద్ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ మీడియా ఛానల్ ముఖాముఖిలో చెప్పారనేది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి సెల్వమణి ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అయితే, సెల్వమణి వ్యాఖ్యలపై ముకుంద్ సీరియస్‌గా స్పందించారు. సెల్వమణి వ్యాఖ్యలతో నా పరువుకు నష్టం వాటిల్లిందని కేసు దాఖలు చేశారు. కోర్టులో కేసు వేసిన ముకుంద్ మృతిచెందారు. అయితే, ఆ కేసును ముకుంద్ కొడుకు గగన్‌బోత్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాలేదు.
గతంలోనూ సెల్వమణి విచారణకు దూరంగా ఉన్నారు. అతనికి సంబంధించిన లాయర్లు కూడా కోర్టుకు రాలేదు. దీంతో సెల్వమణి తీరుపై చెన్నై జార్జిటౌన్ కోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సెల్వమణికి కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయంపై మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి స్పందించలేదు.