ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.రోజురోజుకు ఈ కాలుష్యం(pollution) అతిపెద్ద ముప్పుగా మారుతోంది. పర్యావరణ వ్యవస్థలకు అంతరాయం కలిగించే ప్రతికూల మార్పులకు కారణం అవుతుంది. దీని కారణంగా మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తోంది. అదే సమయంలో మానవ జీవన ప్రమాణాలు కూడా దిగజారుతున్నాయి.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎదుర్కొంటుంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా ఢిల్లీ(delhi) మారిందని, ఈ నగరవాసుల ఆయుష్ ప్రమాణం కూడా గణనీయంగా తగ్గిపోతుందని తాజా గణాంకాలు వెల్లడించాయి. చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ సంచలన విషయాలు వెల్లడించింది.
తాజా అధ్యయనంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా అవతరించిందనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు ఆరోగ్య స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్నట్లు వెల్లడించింది. ఈ కారణంగా ఈ నగరంలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 11.9 సంవత్సరాలు (12 ఏళ్లు) తగ్గిపోనున్నట్లు పేర్కొంది.
భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజలందరూ వార్షిక సగటు కాలుష్య స్థాయిలు (PM 2.5) WHO మార్గదర్శకాన్ని మించి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలోని జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 μg/m3 కంటే కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 67.4 శాతం తీవ్ర కాలుష్య పరిస్థితులెదుర్కొంటున్నాయని తెలిపింది.
పర్టిక్యులేట్ పొల్యూషన్ అనేది ఆయుర్దాయం పరంగా భారతదేశంలో మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పు అనీ, సగటు భారతీయ పౌరుడి ఆయుర్దాయం 5.3 సంవత్సరాలు తగ్గుతుందని తెలిపింది. దీనికి కారణంగా హృదయ సంబంధ రోగుల ఆయుర్దాయం సుమారు 4.5 సంవత్సరాలు తగ్గుతోందని, అయితే.. పిల్లలు, తల్లి పోషకాహార లోపం వల్ల ఆయుర్దాయం 1.8 సంవత్సరాలు తగ్గుతుందని వెల్లడించింది.
పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతంలో పార్టికులేట్ పొల్యూషన్ స్థాయి డబ్ల్యూహెచ్వో సూచించిన స్థాయి కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉందనీ, ఒకవేళ కాలుష్య తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే.. జీవితకాలం 3.1 సంవత్సరాలు తగ్గనున్నదని రిపోర్టు తెలిపింది. ఢిల్లీ ప్రాంతంలో మిగితా దేశంతో పోలిస్తే.. సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.
వాహనాలు, నిర్మాణాలు, వ్యవసాయం వల్ల కూడా కాలుష్యం అధికంగా ఉన్నట్టు గుర్తించింది. కాలుష్య వాయువులను పీల్చడం వల్ల బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశీయుల ఆయుర్దాయం ఆరేళ్ల వరకు తగ్గుతోందని అంచనా వేసింది.