చంద్రుడిపై ప్రజ్ఞాన్ (Pragyan Rover) తొలి విడత ప్రక్రియ సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 (Chandrayaan-3) మిషన్ లో భాగంగా జాబిల్లి దక్షిణ ధృవంపైకి వెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని విజయంతంగా పూర్తి చేసింది. ఆదివారం నుంచి చంద్రుడిపై 14 రోజులు చీకటి ఉన్న నేపథ్యంలో రోవర్ ను ఇస్రో శాస్త్రవేత్తలు స్లీప్ మోడ్ లోకి పంపించారు. సురక్షితమైన ప్రాంతంలో పార్క్ చేసి రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించినట్లు ఇస్రో ప్రకటించింది.
ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్లను ఇస్రో శాస్త్రవేత్తలు ఆఫ్ చేశారు. రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించే ముందు తాము సేకరించిన డేటాను పేలోడ్లు ల్యాండర్ సహాయంతో భూమిపైకి చేర వేశాయని తెలిపింది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీలు పూర్తిస్థాయిలో రీచార్జ్ అయి ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. మళ్లీ చంద్రుడిపై పగలు రాగానే కాంతిని గ్రహించేందుకు వీలుగా సోలార్ ప్యానల్స్ ను సిద్ధం చేసి ఉంచామని పేర్కొంది.
మళ్లీ చంద్రుడిపై సెప్టెంబర్ 22వ తేదీన వెలుతురు వస్తుందని.. అప్పుడు మళ్లీ సోలార్ ప్యానల్స్ పని చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఒకవేళ సోలార్ ప్యానల్స్ మళ్లీ పని చేస్తే ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ లో నుంచి బయటికి వస్తుందని.. అప్పుడు దానికి కొత్త అసైన్ మెంట్ అప్పజెప్పుతామని ఇస్రో తెలిపింది. లేదంటే చంద్రుడిపై భారత్ అంబాసిడర్ గా శాశ్వతంగా ఉండి పోతుందని వ్యాఖ్యానించింది. ల్యాండర్, విక్రమ్, రోవర్, ప్రజ్ఞాన్ పూర్తిగా సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి.
జాబిల్లిపై రాత్రి అయితే 180 డిగ్రీ సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడి పోతాయని, అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవిత కాలమని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. రాత్రి సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్ రోవర్ లోని వ్యవస్థలు పని చేయవు. ల్యాండర్ రోవర్ లోని వ్యవస్థలు సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి కాబట్టి 14 రోజుల తర్వాత పని చేయడం అసాధ్యం. అందుకే వాటిని స్లీప్ మోడ్ లో పెట్టారు.
అయితే, 14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితే ల్యాండర్ రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్ రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకుని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. అదే జరిగితే మరో లూనా దేవర్ కు సేవలు అందిస్తాయి. అలాగైతే అది బోనస్ గానే భావించాలి.
కానీ, ల్యాండర్, రోవర్ రెండూ పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది. రోవర్ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు. ఈ కారణంగా రోవర్ పని చేసినా ల్యాండర్ రోవర్ కుప్పకూలి పోతే మిషన్ వృధా అవుతుంది. అదే సమయంలో ల్యాండర్ ఒక్కటే పని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. జాబిల్లి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ పరిశోధనలు చేసే రోవర్ పని చేయకపోయినా మిషన్ అక్కడితో ఆగిపోతుంది.