వైఎస్సార్ జిల్లా (YSR Dist) వల్లూరు మండలంలో పుష్ఫగిరి (Pushpagiri) ఆలయ పరిధిలోని పొలాలు, భూములు, తుప్పల మధ్య స్థానికులు వజ్రాల కోసం తవ్వుతుంటారు. తాజాగా గతవారంలో కొందరికి వజ్రాలు (Diamonds) ఇక్కడ దొరికాయనే వార్త బయటకు వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో చుట్టుపక్కల నుంచి కూడా జనాలు భారీగా తరలివచ్చి ఇక్కడ వజ్రాల కోసం తవ్వుతున్నారు.
వీరికి ఏదైనా మెరిసే రాయి దొరికితే దానిని వెంటనే స్థానిక వజ్రాలు, రంగురాళ్ల వ్యాపారుల వద్దకు తీసుకుని వెళ్తున్నారు. అక్కడ వాటికి ఆ వ్యాపారులు విలువ కట్టి ఎంతో కొంత వీరికి ముట్టజెప్తున్నారు. ఈ తవ్వకాల్లో ఏదైనా వజ్రం దొరికితే దానితో తమ బతుకులు మారతాయనే ఇక్కడికి వస్తున్నట్లు తవ్వేవారు చెప్తున్నారు. ఇదే పరిస్థితి అల్లూరిసీతారామరాజు జిల్లాలో కూడా ఉంది. ఇక్కడ మన్యంలోని దొరికే రంగురాళ్లను తవ్వడం, అక్కడ దొరికే రాళ్లను దిగువ ప్రాంతమైన నర్సీపట్నం తీసుకుని వచ్చి అమ్మడం…ఈ పని ఇక్కడా జోరుగా సాగుతోంది.
ఇక వల్లూరు విషయానికి వస్తే….వల్లూరు చెన్నూరు మండలాల సరిహద్దులోని పుష్పగిరి కొండపై ఐదారేళ్లుగా వజ్రాలున్వేషణ సాగుతోంది. అదృష్టం వరిస్తే కష్టాలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో పలువురు దూర ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. వర్షం కురిసిన తర్వాతి రోజుల్లో చెన్నూరు, బాజ్ పేట, ప్రొద్దుటూరు పోరుమామిళ్ల, మైదుకూరు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు కూలీలతో బృందాలుగా వచ్చి…పుష్పగిరి గుట్టంతా తవ్వుతూనే ఉంటారు.
ఈ ప్రాంతంలో 2017లోనే వజ్రాల కోసం ప్రభుత్వ అధికారులు తవ్వకాలు చేపట్టారు. జియోగ్రాఫికల్ సర్వే ద్వారా ఆ ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు అక్కడ తవ్వకాలు చేపట్టారు. మట్టి, దాతువులు, ఖనిజాలను సేకరించి అనంతపురంలోని రామగిరి ప్రాంతంలోని ప్రయోగశాలకు తరలించారు. అనంతరం రెండేళ్ల కిందట ఏరియల్ సర్వే కూడా చేశారు. మండల పరిధిలోని వజ్రాలు నిక్షిప్తమై ఉన్నాయని గుర్తించి వాటిని వెలికి తీసేందుకు ప్రతిపాదనలు వెళుతున్నాయనే వదంతులు చాలా కాలంగా ఇక్కడ వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ వజ్రాలున్నాయనే ఆశతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనాధికారికంగా తవ్వకాలు జరుపుతారు.