R Narayana Murthy: విద్యారంగంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలే ‘యూనివర్సిటీ’…నారాయణమూర్తి
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) విద్యా, వైద్య రంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పలు అంశాల ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘యూనివర్సిటీ’ (University). ఈ సినిమాకి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా నారాయణమూర్తే వ్యవహరించారు. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్లలో(Promotions) భాగంగా వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
విద్యా వ్యవస్థను రక్షించే మెసేజ్ తో యూనివర్సిటీ సినిమా తీశామని నారాయణ మూర్తి తెలిపారు. విద్యారంగంలోని లొసుగులు, విద్యను అమ్ముకోడాన్ని ప్రశ్నించం… మొదలైన సామాజిక అంశాలను ఇందులో చూపించామన్నారు. పేపర్ల లీకేజీతో యువత భవిష్యత్తు ఆగం అవుతోందని తెలిపారు. ఈ లీకేజ్ వల్లే ఎందరో విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని తెలిపారు. విద్య, వైద్యం జాతీయం చేయాలి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అత్యధిక జనాభా ఉన్న దేశం మనదనీ దీంతో ఆటోమేటిక్‌గానే నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంటుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారన్నారు. ప్రభుత్వం తీరు మారాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. సింగరేణి, విశాఖ ఉక్కు మొదలైన సంస్థలను ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే ఉద్యోగ భారతం కాస్తా నిరుద్యోగ భారతంగా మారిపోతుందని తెలిపారు. దీని నుంచి గట్టెక్కాలంటే ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యా వ్యవస్థను రక్షించుకోవాలనే సందేశంతో సమాజాన్ని మేలుకొల్పే విధంగా యూనివర్సిటీ సినిమా ఉంటుందనీ, తన గత చిత్రాల మాదిరిగానే ప్రస్తుతం తాను నిర్మిస్తోన్న ‘యూనివర్శిటీ’ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని నారాయణమూర్తి కోరారు.