ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు (Ap Skill development case) లో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి(Chandrababu naidu) కి ఏసీబీ(ACB) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబును జడ్జి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్(Lokesh) సహా మరి కొంత మంది నేతలు చంద్రబాబును తీసుకొని వెళ్తున్న కాన్వాయ్ వెంట రాజమండ్రి వెళ్లారు. ఇక రాజమండ్రిలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అర్థరాత్రి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. రాత్రి 1.30 తర్వాత చంద్రబాబును పోలీసులు జైలు లోకి తీసుకొని వెళ్లారు. చంద్రబాబు వెంట వచ్చిన వారిని జైలు బయటే నిలిపివేశారు. కేవలం నారా లోకేశ్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు.
అర్థరాత్రి 2.00 గంటల తర్వాత జైలులో పేపర్ వర్క్ పూర్తి కావడంతో నారా లోకేశ్ కూడా జైలు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక చంద్రబాబుకు జైలు అధికారులు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. ఆయనను జైలులోని స్నేహా అప్పర్ బ్లాక్‌కు తరలించారు. కాగా, లోకేశ్ సహా చాలా మంది టీడీపీ నేతలు జైలు బయటే వేచి చూస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వందల మంది పోలీసులను మోహరించారు
మరోవైపు రాజమండ్రి అంతటా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు భారీ ఆందోళనకు దిగుతాయనే అంచనాల నేపథ్యంలో రాజమండ్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలులో ఉన్నది. సోమవారం టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవ్వరూ బయటకు రావొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.