భారత్ లో జరుగుతున్న జీ-20 (G-20 Summit) శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఢీల్లి వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పై విమర్శలు చేశారు. పుతిన్ తనకి తానే ‘దౌత్య బహిష్కరణ రూపశిల్పి’గా మార్చుకున్నారని, అందుకు నిదర్శనమే జీ-20 సమావేశాలకు గైరు హాజరు కావడమన్నారు.
వాస్తవికతకు దూరంగా అధ్యక్ష భవనంలో గడిపేస్తూ…ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా పుతిన్ బతికేస్తున్నారని సునాక్ అన్నారు. మిగతా జీ-20 సభ్యదేశాలు పుతిన్ పతనానికి కలిసి పని చేస్తామని చెబుతున్నాయని రిషి సునాక్ అన్నారు.
రిషి సునాక్ తో పాటు బ్రిటన్ అధికార ప్రతినిధులు కూడా రష్యాపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని మానవహక్కులు, ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి, పుతిన్ ఇతర దేశాల ఆక్రమణలను అంతం చేయాడానికి భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం చొరవ తీసుకుకోవాలని మోడీని కోరతామని తెలిపారు.
ఢీల్లి చేరుకున్న రిషి సునాక్, అతని భార్య అక్షితామూర్తికి కేంద్ర మంత్రులు, దౌత్య ప్రతినిధులు స్వాగతం పలికారు. రుషి సునాక్ దంపతుల గౌరవార్థం ఎయిర్ పోర్టు ఆవరణలో భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. వాటిని చూసిన సునాక్ దంపతులు ప్రశంసించారు.
తనకు భారత్ ప్రత్యేకమైనదని, తనని ఇక్కడి ప్రజలు ‘భారత్ అల్లుడు’ అని అంటారని విన్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.