తెలంగాణాలో రైతులకు ఎరువులు (Fertilizers) దొరకడం లేదని, రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకునే కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెప్తారని వైఎస్సార్ టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి (Sharmila Reddy) అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పాలన ఉందో ఎరువులు కోసం సొసైటీ దుకాణాల ముందు క్యూలు కట్టిన రైతుల్ని అడిగితే తెలుస్తుందని ఆమె అన్నారు.
ఇలా రైతులకు కనీసం ఎరువులు దొరక్కుండా చేయడమేనా కేసీఆర్ గారూ మీ ప్రభుత్వ పని, అసలు ఇదేనా దొరా.. మీరు చెప్తున్న రైతు రాజ్యం? అంటూ ఎద్దేవా చేశారు. రైతుకు ప్రభుత్వ సాయం అందటం లేదు, ఏలాగోలా పండించిన పంటను అమ్ముకుందామంటే కొనే దిక్కులేదని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో ఎరువులు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి, 26 లక్షల టన్నుల ఎరువులు ఉచిత పంపిణీతో 55 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుందని ప్రచారం చేసుకున్నారు. అసలు కేసీఆర్ పుట్టిందే రైతులు కోసం అని గొప్పలు చెప్పుకున్నారు. అలాగే ఇలాంటి పథకం ఏ రాష్ట్రం అమలు చేయలేదని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు.
కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా రైతులకు ఇచ్చిన హామీకి ఆరేళ్లు అయ్యింది. కానీ అది అమలు కావట్లేదు. దీనిని అమలు చేయాలనే చిత్తశుధ్ది కేసీఆర్ కు లేదు. అసలు కొందామంటే రాష్ట్రంలో ఎరువులే దొరకడం లేదు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ రాజకీయాలకే పరిమితమయ్యారని అన్నారు. ఈ ఖరీఫ్ కైనా ఉచిత ఎరువులు ఇస్తామన్న మాట నిలబెట్టుకోండని కేసీఆర్ కు సూచించారు.