జీ-20 నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరు కావాలని ఇప్పటికే పలువురు నేతలకు ఆహ్వానం పంపారు. జీ-20 అతిథుల కోసం ప్రత్యేకంగా వంటలు తయారు చేయించారు. విందుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే పలువురు నేతలు ట్వీట్లు చేశారు.
ఇక అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయించారు. విందులో అతిథుల కోసం ప్రత్యేకంగా పన్నీర్ లబాబ్ దార్, పొటాటో లియోనైస్, తండూర్ రోటీ, బట్టర్ నాన్, కుల్చా, కాజూ మటర్ మఖానా, జోవర్ దాల్ తడఖా, ప్యాజ్ జీరా కా పులావ్, కుకుంబర్ రైతా, కేసర్ పిస్తా, రసమలై లను తయారు చేయించారు.
ఇది ఇలావుంటే జీ-20 సమావేశాలకు హాజరైన అతిథులకు ఇచ్చే విందులో భోజనం వడ్డించేందుకు ఉపయోగించనున్న ప్లేట్స్ పై టీఎంసీ నేతలు విమర్శలు గుప్తిస్తున్నారు. ఆ ప్లేట్స్ పై జాతీయ చిహ్నాన్ని ముద్రించారని టీఎంసీ ఎంపీ సాకేత్ అన్నారు. ఈ మేరకు ప్లేట్స్ కు సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.
జీ-20 నేతలకు వడ్డించేందుకు వెండితో చేసిన ప్లేట్స్ ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. వాటిపై జాతీయ చిహ్నం ముద్రించి ఉండటం కనిపిస్తోందన్నారు. ఆ ప్లేట్స్ లో జీ-20 నేతలకు వడ్డించడం అంటే జాతీయ చిహ్నాలను, దేశాన్ని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.