తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్(Cm Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటిదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని విమర్శలు చేశారు. అందువల్ల సనాతన ధర్మాన్ని నిషేధించాలని ఆయన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
కొన్ని విషయాలను వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలన్నారు. దోమలు, మలేరియా, డెంగ్యూ ఫీవర్, కరోనా లాంటి వాటిని వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలన్నారు.సనాతన ధర్మం కూడా అలాంటిదేనని తెలిపారు. అందుకే దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ కామెంట్స్ పై ఇండియా కూటమి ఎందుకు మౌనంగా ఉందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకమేనని తెలిసిపోతోందన్నారు. స్టాలిన్ కుటుంబ సిద్దాంతాలన్నీ క్రిస్టియన్ మిషనరీ నుంచి అరవు తెచ్చుకున్న సిద్దాంతాలుగా ఆయన అభివర్ణించారు. కానీ స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు ససేమేరా అంటున్నారు.
తామంతా అన్నా, పెరియార్, కలైంగర్ ల ఫాలోవర్స్ అని తెలిపారు. తాము ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతామన్నారు. కాషాయ పార్టీ నేతల బెదిరింపులకు తాను భయపడబోనన్నారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలనైనా తాను ఎదుర్కొనేందుకు రెడీగా వున్నట్టు వెల్లడించారు. ద్రవిడ భూమిలో సనాతన ధర్మాన్ని అడ్డుకోవాలన్న తమ నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమన్నారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానపరిచేలా ఉన్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి హోదాలో వున్న ఆయన అన్ని మతాలను సమానంగా చూడాల్సి వుందన్నారు. కానీ ఆయన ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని తెలిపారు.