స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మేల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య (Sarpanch Navya)…తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పిచాలని కోరుతున్నారు. తాజా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మేల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ ఎస్ అధిష్టానం రానున్న ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించలేదు. ఎక్కువ మంది సిట్టింగులకే టిక్కెట్ కేటాయించిన కేసీఆర్ స్టేషన్ ఘన్ పూర్ విషయంలో మాత్రం రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టిక్కెట్ కేటాయించారు. దీనికి కారణం సర్పంచ్ నవ్య రాజయ్యపై చేసిన లైంగిక ఆరోపణలేనని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే ఎన్నికల కోసం కేసీఆర్ టిక్కెట్లను కేటాయించినా కూడా చాలా మంది ఇంకా భీఫారాలు ఇచ్చే వరకు తమకు అవకాశాలు ఉంటాయిని ఆశగా ఎదురు చూస్తున్నారు. స్టేషన్ ఘన్ ఫూర్ ఎమ్మేల్యే తాటికొండ రాజయ్య కూడా తనకే సీటు ఇచ్చే అవకాశం ఉందని కేసీఆర్ తో రాయబారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన రాయబారాలు ఇప్పటీ వరకు ఫలితం ఇవ్వలేదు. ఈ నేపధ్యంలోనే సర్పంచ్ నవ్య తనకు స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ ఎస్ టిక్కెట్ల్ ఇస్తే గెలిచి చూపిస్తానంటూ సోషల్ మీడియా, టీవీ ఇంటర్వ్యూలలో చెప్తున్నారు.
తనకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకరిస్తే స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్ననని, బీఆర్ఎస్ పార్టీ పెద్దల సహకారం ఉంటే తప్పక గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ కడియంకు కేటాయించగా…ఆ స్థానం నుంచే తాను పోటీ చేస్తానంటూ తాటికొండ రాజయ్య ఆశాభావంతో ఉండగా…ఇప్పుడు సర్పంచ్ నవ్య తాను పోటీ చేస్తానంటూ రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.