అమరావతి, రాష్ట్ర: చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) పై టీడీపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తూ…వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నేతలను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) వస్తే వైపీసీలోని ఆ నలుగురిని జైల్లో పెట్టి చిప్ప కూడు తినిపిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varlla Ramaiah) అన్నారు.
చంద్రబాబును అరెస్టు చేస్తే ఓ మహిళా మంత్రి స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చుతూ రోడ్డుపై నృత్యం చేశారని, దీనిని బట్టి ఆమెకు చంద్రబాబుపై ఎంత ద్వేషం ఉందో అర్థమైందన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు గురించి, ఆయన భార్య గురించి ఆ మహిళా మంత్రి తప్పుగా మాట్లాడతారా?, భువనేశ్వరి గారి పట్ల ఆ మంత్రి చూపించిన వెకిలితనం జుగుప్సాకరంగా ఉందని అన్నారు.
ఆ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశామని, చెన్నైలో ఎన్ని ఆస్తులు కొన్నారో దస్తావేజులతో సహా సేకరించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆమెను జైలుకి పంపుతాం, ఆమెతో పాటు పేర్ని నాని, అమర్నాథ్, అంబటి రాంబాబుల చిట్టాలు కూడా మా వద్ద వున్నాయి. మేం అధికారంలోకి రాగానే వారికి కూడా రాజమండ్రి జైలులో చిప్ప కూడు తినిపిస్తామని వర్ల రామయ్య చెప్పారు.
చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డుమార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళుతున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం అని అన్నారు. అలాగే అందోళనలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు వ్యవహారించిన తీరు కూడా దారుణంగా ఉందని చెప్పారు. వీటన్నింటిపైనా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామన్నారు.