స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development Case)అనే ఒక ఫేక్ కేసుతో చంద్రబాబు నాయుడ్ని (Chandrababu Naidu) అరెస్ట్ చేయడం వలన ఆయనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందే తప్ప జగన్ సాధించిందేమీ లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ (MP Rammohan Naidu) నాయుడు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడా ఒక్క రుపాయి కూడా చంద్రబాబుకు కానీ, ఆయన కుటుంబానికి కానీ చేరలేదని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్నా చక్రం తిప్పుతారని అన్నారు. ఢిల్లీలో మీడియో సమావేశంలో రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడి అరెస్ట్ ను సైతం గవర్నర్ కు తెలియపర్చలేదని, అధికారులు సైతం రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవన్ని చూస్తుంటే సీఎం జగన్ ఎంత క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబు రిమాండ్లో ఉన్నా.. తామంతా లోకేష్ నేతృత్వంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ విధంగా ఆందోళన చేపట్టమో, అసలు ఏం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవకాశం ఉన్న అన్ని వేదికల మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
హైదరాబాద్లో పెద్ద ఎతున్న ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని, లండన్, అమెరికాలో కూడా ఆందోళనలు చేశారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఏదీఏమైనా జగన్ చేస్తున్న ప్రయత్నంలో ఓడిపోయారని, అరెస్ట్ తో చంద్రబాబు నాయుడుపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు.