ఇటీవల కాలంలో చాలామంది ప్రజాప్రతినిధులు అత్యుత్సాహనికి పోయి ఏవేవో వ్యాఖ్యాలు చేస్తూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) కూడా అదే చేశారు. గురువుల కంటే గూగుల్ (Google) బెటరని ఆయన చేసిన వ్యాఖ్యాలు (Comments) ఉపాధ్యాయ సంఘాలను తీవ్ర అగ్రహానికి గురి చేశాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం నిర్వహించిన గురుపూజోత్సవ సభలో పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి సురేశ్ టీచర్లపై వ్యాఖ్యలు చేశారు. బైజూస్ తో టెక్నాలజీ మొత్తం ట్యాబుల్లో అందుబాటులో ఉందని, గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని, టీచర్లకు తెలియని అనేక విషయాలను కూడా గూగుల్ అయితే వెంటనే సమాచారం ఇస్తుందని చెప్పారు. గూగుల్ వచ్చిన తర్వాత గురువుల అవసరం లేని పరిస్థితి ఏర్పడిందనే అర్థంలో మంత్రి మాట్లాడారు.
ఇప్పుడు ఈ కామెంట్లే నెట్టింట్లోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల్లో చర్చ రేపడమే కాకుండా వారికి అగ్రహాన్ని కూడా తెప్పించాయి. మంత్రిగా ఉంటూ మాట్లాడాల్సి మాటలేనా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గురువుల సన్మాన సభలో టీచర్లను అవమానించడం మంచిది కాదని కొందరు సూచిస్తే…మరికొందరు విద్యార్థులకు పాఠాలు చెప్తే పాఠశాల విధానానికి మరేది సాటి రాదనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలని మరి కొందరు అంటున్నారు.
ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కానీ, ఏ టెక్నాలజీ అందుబాటులోని లేని రోజుల్లో కూడా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్నవారే నేటి టెక్నాలజీని తయారు చేసే స్థాయికి వెళ్లారనే విషయాన్ని తెలుసుకోవాలని టీచర్లు అంటున్నారు. విదేశాల్లో సైతం టెక్నాలజీ సహాయంతో చదివే చదువులకు కాకుండా ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థులకు పాఠాలు చెప్పే విధానాన్నే అనుసరిస్తున్నాయనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.