విద్యార్థులు (Students) నిద్ర లేవకపోతే ఉపాధ్యాయులు (Teacher) గట్టిగా తట్టి లేదా అరచి నిద్ర లేపుతారు. కానీ తెలంగాణా (Telangana) లోని ఓ ఉపాధ్యాయుడు మాత్రం కర్రతో తలపై రక్తం వచ్చేలా కొట్టి నిద్ర లేపారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని మైనార్టీ బాలుర పాఠశాలలో జరిగింది.
తుంగతుర్తి మైనార్టీ బాలుర పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 540 మంది విద్యార్థులు చదువుతున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న కాంట్రాక్టు ఉపాధ్యాయుడు జానీ విద్యార్థులను నిద్ర లేపుతున్నారు. ఆ సమయంలో ఆరో తరగతి చదువుతున్న సిరాజ్ నిద్ర లేవలేదు. దీంతో అతడి తలపై కర్రతో కొట్టి నిద్ర లేపారు. దీంతో సిరాజ్ తలకు గాయమై, రక్తం కారింది.
పాఠశాల సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో వెంటనే సిరాజ్ ని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అక్కడ చికిత్స చేశారు.
ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవిని వివరణ ఇచ్చారు. విద్యార్థులను నిద్ర లేపే సమయంలో పొరపాటున తలకు కర్ర తగిలి గాయమైందన్నారు. ఇలాంటి ఘటన పాఠశాలలో జరగడం ఇదే మొదటిసారి అని, ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.