శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. ఇందులో మీడియా ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధుల కోసం మీడియా సెంటర్ (Media Centre) ను ఆయన రాంభగీచా-2లో ప్రారంభించారు.
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవ యజ్ఞంలో మీడియా ప్రతినిధులు వాహనసేవల వైభవాన్ని భక్తులకు వ్యాప్తి చేయాలని భూమన కరుణాకరరెడ్డి కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సోమవారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ ప్రారంభించారు.
కోవిడ్ తర్వాత ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని భావిస్తున్నామని, ఇందుకోసం అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మూలవిరాట్టు దర్శనంతో పాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ధర్మప్రచారంలో ఇతర ఆలయాలకు టీటీడీ ఆదర్శంగా నిలుస్తోందని, ఆలయ ప్రాశస్త్యాన్ని పెంచడంలో టీటీడీ అధికారుల పాత్ర ఎనలేనిదని చెప్పారు.
తన చిన్నతనంలో రోజుకు 6 వేల నుండి 7 వేల మంది భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చేవారిని, ప్రస్తుతం రోజుకు లక్ష మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. కొందరు పనిగట్టుకుని చేసే విమర్శలను పట్టించుకోకుండా భక్తుల సేవతో ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
మీడియా సెంటర్లో మీడియా ప్రతినిధులకు భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, టెలిఫోన్ వసతిని టీటీడీ కల్పించిందని చెప్పారు.