తిరుమల (Tirumala) కాలి నడక మార్గంలో ఉన్న మండపాలను పునర్నిమ్మాణం చేస్తుంటే, వాటిని కూల్చేస్తున్నామంటూ కొందరు సోషల్ మీడియా (Social Media) లో అసత్య ప్రచారం చేయటం తగదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. అసత్య ప్రచారం వలన భక్తుల్లో అలజడి మొదలవుతుందని, తిరుమలలో ఉన్న ప్రతి రాయిని కాపాడే బాధ్యత టీటీడీదేనని, అటువంటిది కూల్చివేస్తున్నామంటూ ప్రచారం చేయడం ఎంత వరకు సబబని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“అలిపిరి మెట్ల మార్గంలో కొంచెం ముందుకు పోగానే అక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాలున్నాయి. వాటిలో ఒకటి శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కుడి వైపున్న మరో రాతి మండపం ఉంది. ఇది కూడా శిధిలావస్థకు చేరుకునే పరిస్థితిలోనే ఉంది. ఇవి కనీసం పునర్మిమ్మాణం చేసేందుకు కూడా వీలులేని స్థితిలో ఉన్నాయి. ఇందులో వీలున్నంత మేరకు తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగే తిరుమలలో శిధిలావస్థకు చేరుకున్న పార్వేట మండపం కూల్చి…పునర్నిమ్మిస్తున్నాం.” అని ధర్మారెడ్డి వివరించారు.
“కానీ దీనిపై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేశారు. దీనిని 16 వ శతాబ్దం లో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేశారు. దీనిని 20 పిల్లర్లతో యథావిధిగా పునర్నిమ్మిస్తున్నాం. ఇలా తిరుమలలో శిధిలావస్థకు చేరకున్న వాటిని ఒక్కొక్కటిగా పునర్నిమ్మిస్తుంటే…కొందరు కావాలని పనిగట్టుకుని కూల్చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. వీరిపై చట్టపరమైన చర్చలు తీసుకుంటాం” అని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
నడక మార్గంలో చిరుతల సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామని తెలిపారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటలు తర్వాత చిన్నపిల్లలను నడక దారిలో అనుమతించాలనే ఆదేశాలేమి రాలేదని తెలిపారు. అలాగే నడకప మార్గంలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. నడకమార్గంతో పాటు పరిసర ప్రాంతాలలో జంతువుల కదలికలపై నిఘా ఉంచామని, సీసీ కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు.