ఉత్తమ జాతీయ పర్యాటక గ్రామం (Best National Tourist Village) గా శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ శిల్పకళాక్షేత్రం లేపాక్షి (Lepakshi) ఎంపికైంది. ఢిల్లీ (Delhi) లో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పర్యాటక శాఖ నుంచి లేపాక్షి సర్పంచ్ ఆదినారాయణ అవార్డు అందుకున్నారు. లేపాక్షికి జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లేపాక్షిని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల కోసం స్థానికంగా అన్ని సదుపాయలు కల్పిస్తామని సర్పంచ్ తెలిపారు. అవార్డు రావడంలో కృషి చేసిన రాష్ట్ర పర్యాటక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షికి ఉత్తం పర్యాటక గ్రామంగా జాతీయ అవార్డు రావడం పట్ల ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు కోసం దేశ వ్యాప్తంగా మొత్తం 795 గ్రామాలు పోటీ పడ్డాయని చెప్పారు. చివరకు ఏపీలోని లేపాక్షికి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. లేపాక్షిని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి ఒక చిన్న గ్రామం. లేపాక్షి సాంస్కృతికంగా, పురావస్తుపరంగానే కాకుండా ఆలయాల పరంగా కూడా ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ అనేక పురాణ గాధలకు చెందిన శిల్పాలు ఉన్నాయి. వీటి ఆధారంగానే తోలుబొమ్మల ప్రదర్శనలు చేస్తుంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.