రేపటి నుంచి ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) యాత్రకు తెలుగుదేశం పార్టీ (Balakrsihna) మద్ధతు తెలుపుతున్నట్లు హిందూపురం ఎమ్మేల్యే బాలకృష్ణ ప్రకటించారు. తెలుగు దేశం కార్యకర్తలు,అభిమానులు పవన్ వారాహి యాత్రలో సంపూర్ణంగా పాల్గొంటారని, జనసేనతో కలిసి ఇప్పటికే క్షేత్రస్ధాయిలో టీడీపీ క్యాడర్ పనిచేస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. అయితే వారాహి యాత్రలో మాత్రం అధికారికంగా ఇరుపార్టీలు పాల్గొనడం ఇదే తొలిసారి.
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇవాళ నంద్యాలలో భేటీ అయింది. చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి రోజు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని బాలకృష్ణ వెల్లడించారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా పోరాడుతాయని ఆయన పేర్కొన్నారు. కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలకృష్ణ ఆరోపించారు.
రేపటి నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుకానుంది. తొలి రోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవుతారు. అలాగే జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నాలుగో తేదీన పెడనలో వారాహి యాత్ర ఉంటుంది.