తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ప్రేయసి (Lover) మీద ప్రియుడు బ్లేడుతో దాడి చేసిన సంఘటన విశాఖపట్నంలో (Visakhapatnam) చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలని కుటుంబ సభ్యులు హాస్పిటల్ (Hospital)కు తీసుకెళ్లారు. పోలీసులు (Police) అందించిన వివరాలు ప్రకారం…
మల్కాపురం సమీపంలోని నెహ్రు నగర్ ప్రాంతానికి చెందిన లలిత శ్రీ, రామారావు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో లలిత రామారావును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. పంచాయతీ పెద్దల వరకూ వెళ్లగా… వారు ఇద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంత చెప్పినా… రామారావును పెళ్లిచేసుకోడానికి లలిత అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన రామారావు… మేడమీద వాకింగ్ చేస్తున్న లలిత దగ్గరకు వెళ్లి బ్లేడ్ తో దాడి చేశాడు.
పది రోజుల కిందటే ఇరుపక్షాల పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నా లలిత తాను రామారావును పెళ్లిచేసుకోనని చెప్పింది. తాజాగా మళ్లీ అదే విషయం మీద ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. పెళ్లికి ఒప్పుకోకపోతే తాను బ్లేడ్ తో కోసుకొని చనిపోతానని బెదిరించాడు. అయినప్పటికీ అమ్మాయి స్పందించకపోవడంతో రామారావు లలిత శ్రీ కంఠంపై బ్లేడ్ తో కోశాడు. దీంతో ఆమె కు తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయింది. అది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబీకులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కంఠం మీద 12 కుట్లు పడ్డాయని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.