విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steelplant) ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచన చేస్తోందనే సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్టేనని, అయితే సంస్థను లాభాల బాటలో నడిపించాల్సి ఉందని, అప్పుడు మాత్రమే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రజల ఆస్తి అని, దీనిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని జీవీఎల్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారాలకు పాల్పడరాదని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు, ఐరన్ ఓర్ గనులు కేటాయించకపోవడానికి మోదీ సర్కారుదే బాధ్యత అనడం తగదని, కాంగ్రెస్ హయాంలోని గత యాజమాన్యం వల్లే సంస్థకు ఇబ్బందులు వచ్చాయని అన్నారు.
స్టీల్ ప్లాంట్ కు అవసరం అయ్యే ఐరన్ ఓర్ కోసం గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. అంతే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక గాడిన పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లాభాల్లో కూడా లేదని జీవీఎల్ చెప్పారు. రోజుకు మూడు ర్యాకులు బొగ్గు ను అందిస్తోన్న తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని అన్నారు.
దాదాపు ఏడాదిన్నర క్రితం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటీ నుంచి కార్మిక సంఘాలు, ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు, అందోళనలు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాబోతున్న ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేసుకుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.