తెలంగాణ వ్యాప్తంగా వానలు వాయిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో వర్షాలు విరుచుకుపడుతున్నాయి. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఒక్కరోజులో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది.
గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి డిచ్పల్లి మండలం మాధవనగర్ గుడి ఎదుట ఉన్న మినీ వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే గుడి ఎదుట రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రయాణికులు 10 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్- కంటేశ్వర రోడ్డు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ రైల్వే పైవంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా మినీ వంతెనను నిర్మించారు.
దీనిపై రాకపోకలు సాగించేందుకు భారీ వాహనాలకు అనుమతి లేనప్పటికీ ఇదే రహదారిలో వెళ్తుండడంతో వంతెన మొదట కుంగిపోయింది. మిగిలిన భాగం తాజాగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో వేర్ ఈజ్ మై విలేజ్ అంటున్నారు ఆవలి వైపునున్న గ్రామ ప్రజలు.