ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞత గల నేత అని చెప్పారు ప్రధాని మోడీ (PM Modi). పటేల్ జయంతి సందర్భంగా కేవడియాలో ఉన్న ఆయన విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. జాతీయ సమైక్యతకు పటేల్ చేసిన సేవలను మోడీ గుర్తు చేశారు. దేశం పట్ల పటేల్ నిబద్దత మనకు మార్గదర్శకంగా కొనసాగుతుందని అన్నారు.
దేశంలో బుజ్జగింపు రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు మోడీ. జమ్ముకాశ్మీర్ ప్రజలు ఉగ్రనీడ నుంచి బయటపడ్డారని.. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. చాలా దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయని.. కానీ, భారత్ లో ఆ పరిస్థితులు లేవని తెలిపారు. వచ్చే 25 ఏళ్లు భారత్ కు చాలా ముఖ్యమైనవన్న ఆయన.. ఆలోపే అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాల్సి ఉందన్నారు. ఇక, కార్యక్రమంలో భాగంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది ఏర్పాటు చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ ఈవెంట్ లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్-చైనా సరిహద్దులోని గ్రామాలకు చెందిన కళాకారులు కూడా ప్రదర్శనలు ఇచ్చారు.
పటేల్ జన్మదినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ వాళ్లు దేశాన్ని ముక్కలు చేసి విడిచిపెట్టారని అన్నారు. ఆ సమయంలో పటేల్ 550కి పైగా సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి భారతమాత పటాన్ని రూపొందించే పని చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా పాల్గొన్నారు.
ఇక ఢిల్లీలోని పటేల్ చౌక్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహా పలువురు ప్రముఖులు పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్) లో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. “సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా, మన దేశం విధిని రూపొందించిన ఆయన అనిర్వచనీయమైన స్ఫూర్తిని, అసాధారణ అంకితభావాన్ని గుర్తుచేసుకుందాం. జాతీయ ఐక్యత పట్ల ఆయన నిబద్ధత మనకు మార్గదర్శకంగా కొనసాగుతోంది. పటేల్ సేవకు రుణపడి ఉండాలి” అని ట్వీట్ చేశారు మోడీ.