వరుసగా రెండోసారి గెలిచి సత్తా చాటాలని వైసీపీ (YCP) అధినేత జగన్ (Jagan) వ్యూహాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో నేతలను మారుస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని కొందరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈమధ్యే ఆ పార్టీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupati Rayudu) కూడా గుడ్ బై చెప్పేశారు.
తాను వైసీపీని వీడుతున్నట్టు వెల్లడించారు ఏటీఆర్. ‘వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు రాయుడు. తదుపరి ఏం చేయబోతున్నది త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. దీంతో సడన్ గా ఏమైంది బ్రో అని వైసీపీ కార్యకర్తలు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సీఎం జగన్ సమక్షంలో డిసెంబర్ 28న వైసీపీలో చేరారు రాయుడు. ఆ సమయంలో జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. తాను మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానినని అన్నారు. ఆయన అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే.. కరెక్ట్ గా పది రోజులు తిరక్కుండానే.. వైసీపీని వీడుతున్నట్టు రాయుడు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
చాలా రోజులుగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు అంబటి రాయుడు. ఈయన సొంత ఊరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున గుంటూరు ఎంపీ స్థానం నుంచి బరిలో దిగుతారని వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే ఆయన కొన్నాళ్లు గ్రామాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. విద్యార్థులకు సాయం చేస్తున్నారు. జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. చివరకు ఆయనే వైసీపీ రాజకీయాలకు రిటైర్డ్ హర్ట్ ప్రకటించారు.