రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) కేసులో తవ్విన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మొన్నటివరకు నోరు మెదపని ప్రణీత్ రావు (praneeth rao) ఇప్పుడిప్పుడే తను చేసిన ఘోరాల చిట్టా విప్పుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఓ మంత్రి అండతో ప్రతిపక్ష పార్టీల కీలక నేతలతో పాటు అధికార పార్టీ నేతలు, వ్యాపారులు,అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి గుట్టుగా సమాచారాన్ని గత ప్రభుత్వం పెద్దలకు అందజేసినట్లు ఇప్పటికే విచారణలో తేలింది.
ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో ఉన్న మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలను అధికారులు అతని నుంచి రాబట్టారు. ట్యాపింగ్ డేటాను సేకరించి అనంతరం హార్డ్ డిస్కులను వికారాబాద్ అడవుల్లో పారేసినట్లు విచారణలో ప్రణీత్ రావు అంగీకరించాడు.
మొత్తం 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి, కట్టర్ల సాయంతో ఎందుకూ పనికి రాకుండా చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అడవుల్లో పడేసిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలాఉంటే ప్రణీత్ రావు వెనుక ఓ మాజీ మంత్రితో పాటు ఓ మీడియా సంస్థ యాజమాని కూడా ఉన్నట్లు సమాచారం.ఏకంగా అతని వద్దే సర్వర్‌ను ఏర్పాటు చేసి అతను ఇచ్చిన 100 నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డేటాను 17 కంప్యూటర్ల ద్వారా ప్రైవేట్ డ్రైవుల్లోకి కాపీ చేసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు డైరీలో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించారు. విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.